ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియ ప్రారంభం.. 2లక్షల మందికి ఉద్యోగ అవకాశం

andhra-pradesh-government-released-order-over-grama-volunteers-recruitment
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గ్రామ వాలంటీర్ల నియమకానికి సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దరఖాస్తులు స్వీకరిణ కోసం ప్రభుత్వం http://gramavolunteer.ap.gov.in పేరుతో ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. ఆసక్తి, అర్హుత కలిగిన అభ్యర్థులు ఈ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దాదాపు 2లక్షల మందికి ఉద్యోగం లభించనున్నాయి.

సోమవారం నుంచి దరఖాస్తుకు అవకాశం వాలంటీర్ల భర్తీ కోసం జిల్లాల వారీగా 2 తెలుగు దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. ఈ నెల 24న నోటిఫికేషన్ వెలువడనుండగా.. జులై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ స్థానికతే ప్రాథమిక అర్హతగా ప్రభుత్వం వాలంటీర్ల నియామకం చేపట్టనుంది. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదో తరగతి, మిగిలిన గ్రామాల్లోని వారికి ఇంటర్ కనీస విద్యార్హతగా నిర్ణయించారు. 18 నుంచి 35ఏళ్ల వయసు మధ్య వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి జులై 11 నుంచి 25వ తేదీ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.వార్డ్ వాలంటీర్ల నియామకం గ్రామ వాలంటీర్లతో పాటు నవరత్నాల పథకాలను పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు చేరవేసేందుకు వార్డు వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించడానికి అనుమతిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో http:// wardvolunteer.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి డిగ్రీ పాసై, స్థానికుడై ఉండాలని స్పష్టంచేశారు. 18 నుంచి 35ఏళ్ల వయసు మధ్య వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించారు. వలంటీర్లకు గౌరవ వేతంగా నెలకు రూ.5వేల చొప్పున చెల్లించనున్నారు. వీరి ఎంపిక కోసం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మెప్మా సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.

ఆగస్టు 15 నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో ఆగస్టు 15 నుంచి వాలంటీర్ల వ్యవస్థ అమల్లోకి రానుంది. ఆగస్టు ఒకటి నాటికి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఎంపిక చేసి వారికి మండలాలవారీగా ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 15న వారు విధుల్లో చేరనున్నారు. గ్రామ వాలంటీర్లకు నెలకు రూ.5వేల చొప్పున వేతనాలు చెల్లించేందుకు ఏటా 1200కోట్లు ఖర్చు కానుంది. వాలంటీర్ల నియామక ప్రక్రియను పర్యవేక్షించేందుకు రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. వాలంటీర్ల నియామకంలో అధికారులకు తలెత్తే సందేహాలను ఈ కమిటీ నివృత్తి చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడితే పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖలోని ఐటీ విభాగం, ఆర్‌టీజీఎస్‌లో పనిచేసే ముగ్గురు నిపుణులతో కమిటీ నియమించారు.

అవినీతికి తావులేకుండా వాలంటీర్ల నియామక ప్రక్రియలో మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అన్ని కేటగిరీల్లో సగం మంది మహిళలకు అవకాశం కల్పించనున్నారు. గ్రామాల్లో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా జిల్లా కలెక్టర్ ఎంతమంది వాలంటీర్లను నియమించాలన్నది నిర్ణయించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చేసే ఉద్దేశంతో అర్హులందరికీ పథకాలు చేరవేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది.

గ్రామ వాలంటీర్ల నియమకానికి : http://gramavolunteer.ap.gov.in
పట్టణ ప్రాంతాల్లో నియమకానికి :  http://wardvolunteer.ap.gov.in

No comments:

Post a comment